Latest Video :

నా దుబాయ్ యాత్ర..

నా దుబాయ్ యాత్ర..
 
ఈ మధ్య దుబాయ్ దేశం లో ప్రదర్శన ఇవ్వడానికెళ్ళాను..ఆ విశేషంబెట్టిదనిన..

ఒకానొక శుభ సమయం లో (నాకు శుభవార్త వచ్చింది కాబట్టి), గూగులు వారి కాల్ యంత్రం (google talk)లో ఒక ఫోనొచ్చింది..ఒక తెలుగు కార్యక్రమం చేస్తున్నాం..నువ్వూ రావాలి అని..ఆహా ఏమి నాభాగ్యమూ అని పరవశించి, ఒక్క గెంతు గెంతా సీటు లోంచి..చాలా కాలం గా నా బరువు మోస్తున్న కారణంగా అణిగి ఉన్న నా కుర్చీ ఒక్క సారి మోఖం లభించే సరికి తన మీద పడతానేమో అని ఒక అంగుళం వెనకడుగేసింది..దాంతో అప్పటికే మేఘాల్లో తేలుతున్న నేను అమాంతం భూమ్మీదకి వచ్చా..(పడ్డా అనడానికి సిగ్గు పడి)..మా ఆఫీసు వాళ్ళు జాలిపడి..జారి పడ్డ నన్ను లేపి..జరిగిపోయిన కుర్చీ ని లాగి జరిగి పోయిన దాన్ని గురించి బాధ పడద్దని, పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాడని, నన్ను ఓదార్చి.. దుబాయ్ యాత్ర గురించి తెలుసుకుని...తమ సంతోషం వ్యక్తం చేసారు.


మరో నాల్రోజుల్లో ప్రయాణం..ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయ్..ఈలోగా ఓ సహోద్యోగి..సార్ దుబాయ్ లో ఏంటి సార్ స్పెషలు..అక్కడ ఏమి దొరుకుతాయ్ అని అడిగాడు..చెప్పే వాడికి వినే వాడు లోకువ కదా అని..నాకు తెలిసిన..తెలీని విషయాలు అన్నీ చెప్పేశా. అక్కడ డేట్స్ దొరుకుతాయ్, ఎలెక్ట్రానిక్ ఐటెం బాగుంటాయ్, ఇంకా చాలా చాలా..ఆ తరువాత తెలిసింది పైన చెప్పిన సామెత అన్ని చోట్లా వర్తించదు అని..ఎందుకంటే అతనిచ్చిన షాకుకి ...


సార్ ఐతే ఒక చిన్న సాయం చేయండి సార్, అక్కణ్ణుంచి నాకో 2 కిలోలు డేట్స్ పట్రండి సార్, మా ఆవిడకి చాలా ఇష్టం..అన్నాడు..సరే..కానీ అక్కడ రక రకాల క్వాలిటీలుంటాయ్..రకరకాల రేట్లుంటాయ్ నీకే రేటు డేట్స్ కావాలన్నాను.. మీ ఇష్టం సార్ మీకేవి నచ్చితే అవి తేండి, మీరేవి తెచ్చినా నాకు ఫరవాలేదు..ఎలాగూ పార్టీ ఇవ్వాలి కదా..దాని బదులు ఇవి అంతే అంటూ తన తెలివి చూపించాడు..ఏమనాలో అర్ధం కాక ఒక వెర్రి నవ్వు నవ్వి..ఇవతలకి వచ్చేసా...అక్కడ మరొకరు రెడీ గా ఉన్నారు..సార్ అతనేమడిగాడు దుబాఇ నుంచి ఏమన్నా తెమ్మన్నాడా .. అతనెప్పుడూ అంతే సార్ ఏదో ఒకటి తెమ్మంటాడు..కానీ డబ్బులివ్వడు..మీరు ఏమీ తేకండి అతనికి..అన్నది..ఆహా ఎంత మంచి మనసు..అనుకున్నా... సార్ నేనలా కాదు సార్ నాకో ఐపాడ్ తీసుకురండి..నేను డబ్బులు ఇచ్చేస్తా..కాకపోతే..ఓ రెండు మూడు నెలల్లో అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది..


సరే అలాంటి బాలరిష్టాలన్నీ దాటుకుని,,రేపే నా ప్రయాణం అని ముస్తబౌతున్న వేళ మళ్ళీ ఫోను..దుబాయి నుంచి..ఏవండీ మీరెలాగూ వస్తున్నారు కదా..ఓ గజ మాల పట్రండి ఇక్కడ దొరకదు అని హుకుం..ఓ అలాగేనండీ అదెంత భాగ్యం అన్నా.. కానీ కొన్న తరువాత కానీ తెలీదు అది 20 కిలోల బరువుంటుందని..ఫ్లైట్ లో వాళ్ళు ఎలో చేసేది 20 కిలోలు ప్లస్ హ్యాండ్ బ్యాగేజీ..ఇక చేసేదేమీ లేక నా సరంజామా తగ్గించి..ఆ దండ..నా బట్టలు తో ఎయిర్పోర్ట్ కి బయలు దేరా. క్యాబుకి ఫోను చేస్తే..కిలో మీటర్ కి 10 రూపాయలు..వైటింగు కి 50, పార్కింగు కి 70 మీరే కట్టాలి..అని వరమందించారు..సరే తప్పదు కదాని పద మన్నాను ... తెల్లవారి ఐదింటికి బయలుదేరి...తవ్వి వదిలేసిన రోడ్డు మీద గెంతుతూ..ఎగురుతూ..పడుతూ..మొత్తానికి షమ్షాబాదు ఎయిర్పోర్టు చేరా..అదిగో అల్లదిగో..అంటూ దిగవలసిన పాయింటు కనపడుతుండగా...ఠప్....స్ స్ స్ స్ స్ స్ స్స్ అంటూ రహ్మాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వినిపించింది..ఏమైందా అని చూస్తే టైరు పంచరు..సార్ అన్నాడు..ఆహా ఏమిటీ వైపరీత్యము అనుకున్నా..చిన్న బ్రిడ్జి ఎక్కితే నేను దిగవలసిన ప్లేసు..ఐనా చేయగలిగింది లేదు..ఎందుకంటే చేతిలో గజమాల..దాని బరువు బాధ్యత నాదే కాబట్టి .. కానియ్య మన్నాను. అతను పాపం వెంటనే టైరు మార్చేసాడు..గబ గబ్బా పైకి జేరి.. టికెట్ చూపించి లోనికెళ్ళా బోర్డింగు పాసు కోసం..వారు నా ముఖారవిందం చూసి..నాయన నీ పుదీనా దండని ర్యాప్ చేయించు.. అన్నారు దమ్మిడీ దానికి రూపాయి ఖర్చు అన్నట్టు..250 రూప్యములు పెట్టి కవరింగు చేయించా..దండని..ఇక బోర్డింగు పాసు పుచ్చుకుని లోనికెళ్లా స్టాంపింగు కోసం..ఎందుకెళ్తున్నావ్ అడిగాడాయన..ప్రోగ్రాముకన్నాను..ఐతే బిజినెస్ వీసా మీదెందుకెళ్తున్నావ్..అన్నాడు..నాకు వాళ్ళు అదే పంపారన్నాను..ఐతే కుదరదన్నాడు..ఎందుకన్నాను..నీకు చెప్పనుగా..వెళ్ళు వెళ్ళి అక్కడ నుంచో అన్నాడు....భయ మేసింది..ఎవరినైనా అడుగుదామంటే సిగ్గేసింది..సార్ సార్ సరిగా చూడండి..ప్లీజన్నాను..చూసా ఇక వెళ్ళు అక్కడికి అన్నాడు..వెనకనుంచీ కొందరు..భాయ్ సాబ్ జల్దీ కరో అని తిడుతున్నారు..ఏడుపొచ్చినంత పనైంది..ఏం చెయ్యాలో అర్ధం కాలేదు..నెమ్మదిగా ఇవతలకొస్తుంటే మళ్ళీ పిలిచాడు..ఏంటన్నాను..ఇందులో రూల్స్ ఉన్నాయ్ చూసుకో అన్నాడు..పుస్తకం ఇచ్చాడు చూసా ..అర్ధం కాలేదు..అదే చెప్పాను..అక్కడి కానిస్టేబుల్ ని అడగమన్నాడు.. అతను చెప్పాడు పేజి తెరిచి అందులో ఏమైనా పెట్టమన్నాడు..అప్పుడర్ధమైంది.. గాంధీ గారితో రికమెండ్ చేయించా..ఆయన ముఖం చూసి వదిలేస్తున్నా అన్నట్టు ముఖం పెట్టి పళ్ళికిలించి స్టాంపేశాడు...వెంటనే రిపోర్టిద్దామనుకున్నా. కాని ఫ్లైట్ ఎక్కే హడావిడి లో ఉన్నా..అందుకే వదిలేసా..


గబ గబా ఫ్లైట్ ఉన్న వైపు పరిగెత్తా..సినిమాల్లో విమాన ప్రయాణాలని,,,అందమైన ఎయిర్ హోస్టెస్ లని గుర్తు తెచ్చుకుంటూ..పరిగెత్తుకు వెళ్ళి విమానం తలుపు దగ్గర కెళ్ళా..మన ఇళ్ళల్లో పెళ్ళిలైనప్పుడు వాకిట్లో ఎదురొచ్చే పండు ముత్తైదువ చేతిలో హారతి పళ్లెం లేకుండా నవ్వుతూ స్వాగతం అన్నది.. కలయా నిజమా ... తొలి సారి విమాన ప్రభావమా అని ఒక పాట వెనకనించి వినిపిన్స్తుండగా..నా బోర్డింగు పాసు చూపించి లోనికెళ్ళా.. అటు వైపు తిరిగి మరెవరికో సీటు చూపిస్తున్న మరో ఎయిర్ హోస్టెస్ కనిపించింది..పోనీలే కాస్త నయం అనుకున్నా..అతనికి సీటు చూపించి ఇటు తిరిగాక అర్ధమయింది..ఈవిడ..ఇటు మా బామ్మ తరపు చుట్టమని...నాకు తెలిసి..వీళ్ళిద్దరూ..విమానం దిగగానే రిటైరవుతారేమో బహుశా.. అరవై కి అర రోజు దూరం లో ఉన్న ఆ వనితల చిరు నవ్వు చిరాకెత్తించి..బయటకి చూశా ..విశాలంగా పరుచుకున్న రెక్కలు కనిపించాయి.. ఆహా ఏమి భాగ్యము అనుకున్నా.. ఈలోగా పేపర్ చిరిగి పోయిన స్పీకర్ లోంచి గర గరమంటూ ఒక ఖంటం వినిపించింది..అదేంటో అర్ధం అయ్యే లోపల మరో కంఠం సీట్ బెల్టు పెట్టుకోమని అరిచింది..మా ముందు..ఆ ఎయిర్ హోస్టెస్ లు ఆదివారం మూగ వార్తలు చదివే వాళ్ల లాగా ఏవో సైగలు చేసారు... ఆ తరువాత ఏవో కాగితాలు పంచారు..బస్సుల్లో రైళ్ళలో పంచి, డబ్బులడిగినట్టు ఇక్కడ కూడ అనుకుని వెంటనే లేచా జేబులోంచి ఏమైనా తీద్దామని..కానీ ఈలోగా విమానం బయలుదేరడంతో కూర్చుండిపోయి ఆ కాగితాలు చూసా అవి ఇమ్మిగ్రేషన్ కాగితాలు.సరే లే అని సరిపెట్టుకుని కూచున్నా..ఈలోగా ఓ తోపుడు బండి తో వచ్చారు ఆ వృద్ధ కన్యలు...ఏమిటన్నా...బీరా విస్కీ నా అన్నారు.. నాకర్ధం కాలేదు..పొద్దున్నే ఆరింటికి ఇదేమిటి అనుకున్నా.. నా పక్కన ఉన్నవాళ్ళు మాత్రం నన్ను ఏదో ఒక వింత లోకం నుంచి వచ్చిన అవతారం లా చికాగ్గా చూసి వారి వారి బ్రాండ్ లు పుచ్చుకున్నారు..ఆహా స్వర్గానికి దగ్గరగా ఆకాశంలో ఉండడం వల్ల కాబోలు..ఇలా అప్సరసలు...అమృతం అందిస్తారు అనుకున్నా..ఇంకోరకంగా ఆలోచిస్తే భయం పోవడానికి మందు గా ఉపయోగపడుతుందికదా అనిపించింది..ఈలోగా మళ్ళా అప్సరసలు..తినడానికి ఏవో తెచ్చారు..వెజ్జా నాన్ వెజ్జా అన్నారు ..వెజ్ అన్నా..ఒక ప్లేటు ఇచ్చారు..ఒక బన్ను..వెన్న..ఒక వెండి పాత్రలో(తగరపు బొచ్చె అనలేక) బిరియాని..కూర..పప్పు..తెల్లవారుఝామున ఆ ఆహారం ఎలా తినాలో అర్ధం కాక ఆ బన్నుని వెన్నలో ముంచుకు తినేసి..ఇన్ని కాఫీ నీళ్ళు తాగి హమ్మయ్య అనుకున్నా...గ్ర్ గ్ర్ గ్ర్ర్ర్ర్ అని శబ్దం తో మొత్తానికి నాలుగు గంటల ప్రయాణం తరువాత దుబాయ్ విమానాల స్టేషన్ లో దిగాను. మల్లీస్వరి సినిమాలో వెంకటేసు లాగా చాలా దూరం నడిచి నా సామాను తీసుకుని బిక్కు బిక్కు మంటూ ముందుకు కదిలాను..ఎక్కడ చూసినా తెల్ల నైటీలు వేసుకున్న మగవాళ్ళు..నల్ల బురఖా వేసుకున్న ఆడవాళ్ళు..అలా చూసుకుంటూ బయటకొచ్చేసరికి నన్ను పిలిచిన మహానుభావులు..దేవుళ్లలా కనిపించారు..మళ్ళీ హమ్మయ్య అనుకుని వాళ్ల కారు లో ఎక్కి హోటేలుకొచ్చా..పెద్ద హోటలే..రూములో దించాక..ఇంక మీరు ఫ్రెష్ అయి కాస్త రిలాక్సవండి సార్..మధ్యాన్నం అన్నం టైముకొస్తాం..కింద కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది..తినేసి రూం లో రెస్ట్ తీసుకోండి అంటూ హడావిడిగా..వెళ్లిపోయారు..


సరే అని కాస్త ఫ్రెష్ అయి కిందకి వెళ్లా..అక్కడా ఒక నైటీ అబ్బాయి ఒంటె అంత ఎత్తున్నాడు..స్వాగతం పలికాడు..ఆ భీమ సేనుడి నుంచి దూరంగా జరిగి..ఫుడ్డు దగ్గరకొచ్చా..బఫే భోజనం లా అన్నీ అక్కడ ఉన్నాయి మనమే వడ్డించుకోవాలి.. సరే అని వెళ్ళి ఒక్కో మూతా తీసా..ఒంటె కొవ్వుతో చేసిన..ఒక తినుబండారం, చికెన్ కట్లెట్, మటన్ బుల్లెట్టు, వాడి తద్దినం టాబ్లెట్టు.ఏవేవో ఉన్నాయి..ఒక్కటీ మానవాహారం కనపడలేదు.. నెమ్మదిగా వెళ్ళి ఆ భీమ సేనుణ్ణి అడిగా.. is there any thing veg అని..వాడు నన్ను వింత గా చూసి..what అన్నాడు. వెజ్ వెజ్ ఫుడ్..వెజ్ అన్న్నా..వాడు నన్ను చూసి ఒహ్ ఊ మీన్ వెజ్..కమాన్ అని తీసుకెళ్లి కోడి గుడ్డు చూపించాడు..నీ బొంద ఇది నేను తినను అన్నా..వాడికి అర్ధం కాకపోవడం వల్ల బతికి పోయా లేకపోతే మధ్యాన్నానికి లంచ్ కి నన్ను వండేవాళ్లేమో. మరో మూత తీస్తే హైదరాబాద్ సమోసా కనిపించి ప్రాణం లేచొచ్చింది..హమ్మయ్యా అనుకుని అది తీసుకోవడానికి..ప్రయత్నిస్తుంటే ...That is kheema samosa అన్నాడు మా భీమ సేనుడు.. వెంటనే కడుపులో తిప్పి ఒక్క సారి షాక్ కొట్టినట్టు దానికి దూరంగా జరిగా..ఇక అక్కడ నాలాటి వాళ్ళు తినేది ఏది లేదని తెలిసి మళ్ళి బన్ను ని వెన్నలో ముంచుకు తిని..కార్న్ ఫ్లేక్స్ ని ఆవు పాలలో కలుపుకుని తిని..రూముకొచ్చి తెలుగు సంఘం వాళ్ల కోసం ఎదురుచూస్తూ నిద్ర పోయా..

ఇంత లో బెల్లు మోగింది..సారీ అండీ మధ్యాన్నం పని వత్తిడి వల్ల రాలేకపోయాం..రేపు శలవు కదా కొంచెం వర్క్ కంప్లీట్ అయ్యే సరికి లేట్ అయింది..రండి డిన్నర్ కి వెళదాం అనే వరకు..అక్కడ రాత్రి అయిందని..నేనేమీ తినలేదనీ గుర్తు రాలేదు..అంటే అంతసేపు పడుకున్నానన్నమాట.. బన్నుకి వెన్నకి థాంక్స్ చెప్పుకుని వాళ్లతో వెళ్ళి మన ఆంధ్ర హోటల్ లో తిని..బయటకొచ్చేసాం. మరునాడు ప్రోగ్రాము చేసుకుని మళ్ళీ ఇండియా బాట పట్టా...విమానం ఎక్కుతూనే అప్సరసలకోసం వెతికా...వీళ్ళు వేరే వాళ్ళు..అవును అన్నట్టు మర్చిపోయా..వాళ్లు నిన్న రిటైరైపోయుంటారు గా... వీళ్ళకి రేపు రిటైర్మెంటు..
 



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
 courtesy :
http://sujanaranjani.siliconandhra.org 
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger