Latest Video :

ఎన్నికల వాతావరణ విశేషాలు

ఎన్నికల వాతావరణ విశేషాలు

వార్తలవగానే , వాతావరణ విశేషాలు వస్తుంటాయి...అలానే ఇకనుంచి ఎన్నికల వాతావరణ విశేషాలుంటే బాగుంటుంది అనిపించింది..ఎందుకంటే ఏ పూట ఎవరు ఎవరితో కలిసున్నారో తెలియట్లేదు కాబట్టి...ఒక వేళ ఆంధ్ర మాప్ లో మన నాయకుల సారీ రాజకీయ నాయకుల ఫొటోలు పెట్టి దానిముందు ఒక అమ్మాయి నుంచుని ఇలా చెబుతుంటే ఎలా ఉంటుందో ఒక సారి ఆలోచించండి........ట్రుయ్యాం ట్రుయ్యాం ట్రుయ్యాం ఖంగారు పడకండి గుండ్రాలు తిప్పుతున్నా అంటే మిమ్మల్ని ఇమాజినేషన్ లోకి తీసుకెళుతున్నా.....రెడీ...వన్ టూ త్రీ...

ఆంధ్ర ప్రదేశ్ మాప్ ముందు అమ్మాయి..

ఈరోజు ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉంది.....అసెంబ్లీ వద్ద నలభై డిగ్రీలుగా ఉండగా..పత్రికా ప్రకటనల వద్ద..యాభై రెండు నమోదైంది...రోడ్ షోలు నిర్వహించే ప్రదేశాలలో కూడా ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..చిరంజీవి రోడ్ షో వద్ద 56 డిగ్రీలు నమోదు కాగా బాలకృష్ణ రోడ్ షో వద్ద 57 నమోదైంది...తె రా సా నిర్వహించిన బాకా సభలో అన్నిటికన్నా అధికంగా 60 డిగ్రీలు నమోదైంది...

తెలంగాణాకు మేము వ్యతిరేకం కాము అని ముఖ్యమంత్రి ప్రకటించడంతో (సోనియా)గాంధీ భవన్ వద్ద కొంచెం చల్లని గాలులు వీస్తున్నాయి...

తెలుగు దేశం నుంచి కొందరు నాయకులు ప్రజా రాజ్యం లోకి మారడం తో ఎన్ టీ ఆర్ భవన్ వద్ద మూడో హెచ్చరిక పతాకం ఎగురవేయడం జరిగింది..ఆ యా నాయకులకు వలస వెళ్ళడం ప్రమాదకరమని పార్టీ నాయకులు సూచించారు..


నాయకుల చూపులు ప్రస్తుతం సీటుపవనాలు వైపూ చూస్తున్నాయి..సీటు ఎటు వుంటే అటు నాయకులు ప్రవహించే ప్రమాదం ఉండడంతో ప్రతీ ఒక్కరీ ఈ ఖరీఫ్(ఖరీదు) సీజన్ లో ఏదో ఒక రకంగా రాయితీలపై సీట్లు ఇస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది...

రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఎం ఐ ఎం.,,,బీ జే పీ లు తమ గేట్లని ఎత్తనుండడంతో అంతటా ఉత్కంట నెలకొంది....

ఎవరు ఎన్ని వరాల వర్షాలు కురిపించినా , లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు సారాలో మునిగిపోవడం ఖాయమని...వాగ్దానాలు నిజమౌతాయని నమ్మి వోట్లు నాటిన వారికి పైరు చేతికొస్తుందన్న(ప్రభుత్వం చెప్పిన పని చేస్తుందని ) నమ్మకం లేదని వాతావరణ కేంద్రం సూచిస్తోంది...

ఎన్నికలలోపల నాటిన వాటికి ఎలక్షన్ సమయంలో (వెద)జల్లే ఎరువులు ఉపయోగపడగలవని ముందు జాగ్రత్త పడమని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది...


ఎలా ఉంది వాతావరణ సూచన....

Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger